Sri Matsya Mahapuranam-1    Chapters   

ఆవశ్యక వివరణము.

ప్రాచీన భారతీయుల సంఖ్యాది పరిభాషలు

భారతీయ సంఖ్యా పరిభాషా.

భాస్కరాచార్యులు లీలావతీ గణితములో భారతీయ సంఖ్యా పరిభాష ఇట్లు చెప్పినారు:

'ఏక దశ శత సహస్రా

యుత లక్ష ప్రయుత కోటయః క్రమశః|

అర్బుద మబ్జం ఖర్వని-

ఖర్వ మహాపద్మ శంకవ స్తస్మాత్‌.

జలధి శ్చాంత్యం మధ్యం -

పరార్ధ మితి దశగుణోత్తరాః సంజ్ఞాః|

సంఖ్యాయాః స్థానానాం-

వ్యవహారార్థం కృతాః పూర్వైః'

'ఏకం (ఒకటి)-1 దశ(పది)-10; శతం (నూరు-వంద) 100; సహస్రం (వేయి)-1000; అయుతం (పదివేలు)-10000; లక్షం (లక్ష- నియుతము)- 100000; ఇట్లే ప్రయుతం (పది లక్షలు) కోటి- అర్బుదం- అబ్జం(పద్మం)- ఖర్వం- నిఖర్వం- మహాపద్మం- శంకుః- జలధిః (సముద్రము) అంత్యం-మధ్యం-పరార్దం అని ఒకదానకి మరియొకటి పదిరెట్లు అగు సంఖ్యలను వ్యవహారార్థమయి పూర్వులు ఏర్పరచి యున్నారు.'

ప్రాచీన భారతీయమానములు

ధాన్యపు కొలతలు ఒక (ప్రాంతమున)

4 గిద్దలు-1 సోల; 2 సోలలు-ఒక తవ్వ(సేరు); 2 తవ్వలు- 1 మానిక; 40 మానికలు-అంకె(డె)ము; 2 అంకెములు-సలక; 2 సలకలు-ఏదుము; 2 ఏదుములు-1 పందుము; 2 పందుములు-పుట్టి; ఇందు ఏదుము (ఏను+తూము(లు); పది+తూములు>పందుము; కాగా-తూము అనగా 32 మానికలు 64 శేరులు.

భాస్కరాచార్యులు: హస్తము (మూర) వెడల్పు-పోడవు-మందము కలిగి 12 కోణములు గల రూపమునకు ఘనహస్తము అని పేరు; ధాన్యాదికము కొలుచుటలో ఈ ఘనహస్తమును'మాగధఖారికా' అందురు: ఖారికాషోడశాంశము ద్రోణము; ద్రోణచతుర్థాంశము ఆఢకము; ఆఢకచతుర్థాంశము ప్రస్థము; ప్రస్థచతుర్థాంశము కుడపము అనినారు.

మరియొక విధముగ

ఎనిమిద ముష్టలు (పిడికిళ్లు) 1 కుంచి; ఎనిమిది కుంచులు 1 పుష్కలము; నాలుగు పుష్కలములు ఆఢకము.

మరియొక విధముగా

ఇరువది ఖారీలు 1 వాహము; పది ఖారీలు 1 భవికా: ఐదు ఖారీలు 1 ప్రవర్తము. ముడిచిన అరచేయి 1 ముష్టి; నాలుగు ముష్టులు 1 కువపశ్రము; నాలుగు కుడపములు 1 ప్రస్థము; నాలుగు ప్రస్థములు 1 ఆఢకము; ఎనిమిది ఆఢకములు 1 ద్రోణము; రెండు ద్రోణములు 1 శూ(సూ)ర్పము; సార్ద (1 1/2) సూర్పము 1 ఖారి; రెండు ద్రోణులనే గోణీ (గోనె) అందురు. ఇదియే భారము (బారువ) అనియు వ్యవహరింపబడును. నాలుగు భారములు 1 వాహము. ఆఢకము= 1/4 ద్రోణము.

ప్రాచీన దైర్ఘ్యమానము

ఒకదాని ప్రక్కను మరియొకటిగా అడ్డముగా త్రిప్పి ఉంచిన ఎనిమిది ప్రమాణపులావు గల యవలు-(వాని నడిమి భాగపులావు) ఆక్రమించు ప్రదేశము 1 అంగుళము; 24 అంగుళములు 1 హస్తము; 12 అంగుళములు 1 వితస్తి; ఇదియే శిల్పములో తాల ప్రమాణము అనుబడును; నాలుగు హస్తము(మూర)లు 1 దండము; 2000 దండములు 1 క్రోశము; 4 క్రోశములు 1 యోజనము; 10 హస్తములు 1 వంశము (వెదురుగడ ప్రమాణము); 20 వంశముల పొడవు- అంతియ వెడల్పుగల సమ చతుర్భుజక్షేత్రము నివర్తము (యోజనము = 32000 హస్తములు)

మరియొక విధముగా

4 హస్తములు 1 ధనువు (1దండము); 1000 ధనువుల 1 క్రోశము; 2 క్రోశములు గవ్యూతి (గోమతము- గోరుతము); 4 క్రోశమలు 1 యోజనము. (=16000 హస్తములు)

పూర్వపు తూకములు (ఒక ప్రాంతమున)

24 తులములు 1 సేరు; 5 సేరులు =నాలుగు సవా సేరులు-1 వీసె; 2 వీసెలు 1 ఎత్తు (కట్టు-ధడియము); 8 వీసెలు-1 మణుగు; 20 మణుగులు 1 పుట్టి (బారువ) ; 3 తులములు 1 పలము; 40 పలములు 1 వీసె.

ఈ చెప్పిన అంశములకు మూలవచనములు:

ధాన్యపు కొలతలు.

'భాస్కరః హస్తోన్మితై ర్విస్తృతి దైర్ఘ్యపిండై -

ర్య ద్ద్వాదశాస్త్రం ఘనహస్త సంజ్ఞం|

ధాన్యాదికే య ద్ఘనహస్తమానం

శస్త్రోదితా మాగధ ఖారిక సా.

ద్రోణస్తు ఖార్యాః ఖలు షోడశాంశః

స్యా దాఢకో ద్రోణ చతుర్థ భాగః|

ప్రస్థ శ్చతుర్థాంశ ఇహాఢకస్య

ప్రస్థాంఘ్రీ రార్యైః కుడపః ప్రదిష్టః.'

'వాహా వింశతిఖారీభి ర్భవికా స్యా దనేన (ద్దశైవ)తు|

ప్రవర్తః పంచఖారీభిః సస్యమానే ప్రకీర్తితః.

తలం ప్రకుంచకం ముష్టిః కుడప స్తచ్చతుష్టయం|

చత్వారః కుడుపాః ప్రస్థ శ్చతుః ప్రస్థ మథాఢకమ్‌.

అష్టాఢకో భ##వే ద్ద్రోణో ద్విద్రోణః సూర్ప ఉచ్చతే.

సార్థసూర్పోభ##వే త్ఖారీ ద్విద్రోణా గోణ్యుదాహృతా.

తామేవ భారం జానీయా ద్వాహో భారచతుష్టయమ్‌.' (అమర సుధా)

అన్యథా

'అష్టముష్టి ర్భవేత్‌ కుంచిః కుంచయో7ష్టౌ తు పుష్కలం|

పుష్కలాని తు చత్వారి ఆఢకః పరికీర్తితః'.

దైర్ఘ్యమానమ్‌

'భాస్కరః :

యవోదరై రంగుళ మష్టసంఖ్యైః

హస్తో 7ంగుళై ష్షడ్గుణితై శ్చతుర్భిః|

హసై#్త శ్చతుర్భి ర్భవతీహ దండః

క్రోశః సహస్రద్వితయేన తేషామ్‌.

స్యా ద్యోజనం క్రోశచతుష్టయేన

తథా కరాణాం దశ##కేన వంశం|

నివర్తనం వింశతివంశ సంఖ్యైః

క్షేత్రం చతుర్భిశ్చ భుజై ర్నిబద్దమ్‌.'

కిష్కు=1 జేన లేదా 1 మూర;

వితస్తిర్ద్వాదశాంగుళమ్‌.

కిష్కుర్ద్వయోర్వితస్తౌచ సప్రకోష్ఠకరే7 పిచ;

ధన్వంతర సహస్రం తు క్రోశః - క్రోశద్వయం పునః |

గవ్యూతం - స్త్రీ తు గప్యూతి ర్గోరుతం గోమతం చ తత్‌.

ఇతి వాచస్పతిః

'ధనుర్హస్తచతుష్టయమ్‌'

ద్వాభ్యాం ధనుః సహస్రాభ్యాం గవ్యూతిః పుంసి భాషితః.'

ఇతి శబ్దార్ణవః

తాలశబ్దార్థము

మత్స్యపురా మూర్తి లక్షణాధ్యాయము; తాలశబ్దార్థః:

''ప్రాదేశ తాల గోకర్ణా స్తర్జన్యాదియుతే తతే.''

అమరకోశః- ద్వితీయ కాండః- మనుష్యవర్గః- 83 శ్లో.

(అత్ర సుధా వ్యాఖ్యా)

తర్జన్యాది సహితే విస్తృతే7గుష్ఠే క్రమేణకైకమ్‌.

అంగుష్ఠతర్జన్యో ర్దైర్ఘ్యం - బొటనవ్రేలిని చూపుడు వ్రేలిని రెండు వైపులకు చాచగా-ప్రాదేశము; అంగుష్ఠ మధ్య మాంగుళ్యోర్దైర్ఘ్యం - బోటనవ్రేలిని నడిమివ్రేలిని చాచగా-తాలము; అంగుష్ఠానామికయో ర్దైర్ఘ్యం - బొటనవ్రేలిని అనామికను చాచగా-గోకర్ణము; అనబడును; బోటనవ్రేలిని చిటికెనవ్రేలిని చాచగా అగు పొడవునకు పేరు ఈయబడలేదు.

కొన్ని శబ్దముల అర్ధములును-వ్యుత్పత్తులను:

విట్పతి శబ్దర్థము (16అ. 11శ్లో)

(ఇచ్చట అనువాదములో ఇచ్చిన అర్థముతో పాటు ఈ యర్థమును కూడ ప్రధానముగానే గ్రహించవలెను)

శ్రాద్ధమున భోక్తలుగ భుజింపజేయ బడదగినవారిలో విట్పతి యొకడు. విట్పతి అనగా అల్లుడు. 'విష్‌' అనగా కూతురు; విషః- పతిః=విట్పతిః కూమార్తెకు భర్త.

విట్పతిః- విషః కన్యాయాః పతిః జామాతా ఇతి జటాధరః;

'మాతామహం మాతులం చ స్వస్రీయం శ్వశురం గురమ్‌|

దౌహిత్రం విట్పతిం బంధుం ఋత్విగ్యాజ్యౌ చ భోజయేత్‌'' మను-3-148.

'భ్రూణ' శబ్దార్థము

'భ్రూణః' అనగా-షడంగ వేదాధ్యేతా; అని హరదత్త పండితుడు; ఆపస్తంబ ధర్మ సూత్రములు 1 ప్రశ్న-19 కండికా-15 సూత్రపువృత్తి చూచునది; ఈ శబ్దమునకు వాడుకలో మరియొక యర్ధమున్నది. కనుక ఇచట ఇట్లు వివరించబడినది.

'మత్స్య' శబ్దార్థము

'మ' అను ఏకాక్షర శబ్దమునకు జలము అని అర్థము; ఇది 'మన్‌' అను ధాతవునుండి 'న్‌' కార లోపముచే. 'గమ్‌' ధాతవునుండి 'గ'వలె నిష్పన్నము;

'మన' ఇత్యేవ యో ధాతు రపా మర్థే ప్రకాశ##తే;

అపాం విదారణా చ్చైవ మందరః స నిగద్యతే. (మత్స్య-121-శ్లో. 60-61)

అప్పులను - జలములను- విదరణము-చీల్చుట-చేయుచున్నది కావున 'మందరము' అని అర్ధము; అనగా ఈ శబ్దమును మ(ం)+దర-ఆని విభజించవలెను; అనగా 'మ' అను ఏకాక్షర శబ్దమునకు 'జలము' లని అర్థమని తెలియుచున్నది.

'మే' 'జలే' తిష్ఠతీతి- నీటియందు ఉండునది; మ+త్య>మ-త్‌-(స్‌) య>'మత్స్య' అగును: ఇచట సకారము (స్‌) ఆగమముగా వచ్చినది.

ఇందలి 'య' 'జ' గా మారగా వర్ణవ్యత్యయముచేత 'మజ్‌ దా' (Mzda) అగును. పార్సీవారి ఈ(Ahur) Mazda మత్స్య శబ్దముతో సంబంధము కలదియని ఊహించవచ్చును. ఈ విధముగా- నారా+అయన>నారాయణ (నీరు తన కాశ్రయముగా గలవాడు-జీవులకు ఆశ్రయమయినవాడు- అను అర్థమునిచ్చు 'నారాయణ' శబ్దముతో మత్స్య శబ్దము సమానార్థకమగును.

'అంబర' శబ్దార్థము

పై హేతువులచే 'జలము' అను అర్థమును ఇచ్చు 'మ' వర్ణ వ్యత్యయముచే 'అమ్‌' (మ్‌+=మ) అగును. 'అమ్‌' = జలం; వృణోతి-నీటిని తనతో కప్పివేయునది-అను వ్యుత్పత్తిచేత అమ్‌+వర>అమ్బర (వ్‌>బ్‌) అగును; ఈ శబ్దము నీరు-ఆకాశము అను అర్థములలో సరిపోవును.

'అభ్ర' శబ్దార్థము

అపో-బిభర్తి-నీటిని భ(ధ)రించునది; అప్‌+భ్ర>అబ్‌+భ్ర>అభ్ర (బకారము లోపించగా) అగుచున్నది; (చూ.ఛాందో.శాం.భాష్య-5అ. 10.ఖం.5)న+భ్ర (భ్రంశ్‌)>అభ్ర-అని మూలమునందు అని మూలమునందు (అ.124;శ్లో.35) ఉన్నది.

ఒకే శబ్దమునకు ప్రకరణానుసారిము విభిన్నార్థములు.

24 అ. శ్లో 51 లో-'ధర్మైకశరణః'-అనుదానిని-షష్ఠీ తత్పురుష సమాసముతో'ధర్మ-ఏక-శరణ' = ధర్మమునకు ఒకే ఒక ఆశ్రయము అనియు బహువ్రీహి సమాసముతో ధర్మము (తనకు) ముఖ్యమగు ఆశ్రయముగా కలవాడు అనియు రెండు విధములగు వ్యుత్పత్తులతో వచ్చు అర్థములును ప్రకరణమున సరిపడుచునేయున్నవి. ఇట్లే ఆర్ష వాఙ్మయమునందు ఆయా పదములకు ఆయా యర్థములను ప్రామాణికముగా సయుక్తికముగా యోజించు కొని విషయములను గ్రహించుకొనవలయును.

'మర్త్య' శబ్దార్థము

'మర్త్యులు' అనగా మరణించు స్వభావము కలవారు అనువ్యుత్పత్తి ప్రసిద్దముగా వినబడుచున్నది. అట్లయినచో ఎవరు మాత్రము మర్త్యులు కారు? ఏదో యొకనాటికి దేవతలకును మరణము కలదు; కాని ఇది యోగరూఢము అన వచ్చును. కాని ఆర్ష వాజ్మయమున 'మర' శబ్దమునకు విశిష్టార్థము కలదు. దాని నుండి శబ్ద పరిణామ ప్రక్రియనను సరించి ఈ శబ్దమునకు సమంజసమగు అర్థమును చెప్పుకొనవచ్చును.

'మర' పదము ఐతరేయోపనిషత్తులో నున్నది. (ఐత-1-2)

''పృథివీ- మరః; మ్రియంత్‌7స్మిన్‌ భూతానీతి.'' ''దీనియందు (ఉండు) ప్రాణులు మరణించును కావున పృథివికి 'మరము' అని వ్యవహారము'' అని శ్రీశంకరులుః; కాని 'మర' శబ్దము అవ్యుత్పన్న మేమో అనిపించును. ఏలయన- 'మరీచి' శబ్దమునకు తేజః కిరణము అర్థము; మరే-అంచతీత మరీచిః- మరమునందు ప్రకాశించునది కాగా 'మర' శబ్దమునకు పారదర్శకముకాని (Non-transparent) తలము అని అర్ధము అయి ఉండవచ్చను.

కాగా మర+త్య>మర్‌ (అ)+త్య>మరమునందు ఉండువారు. అని మర్త్య శబ్దమునకు అర్థమని తలచవచ్చును.

ప్రజాపతులు-వారి పేరులకు అర్థములు

ఈ చెప్పిన హేతువుల చేతనే మరీచి-పులస్త్య-పులహ -క్రతు- ప్రభృతి ప్రజాపతుల నామములు సృష్టికి మూలభూతములగు తత్త్వములను చెప్పు పదములని యూహింప వీలగుచున్నది.

పులస్త్య<పురస్‌-త్య = మొదటగా ఉన్నవాడు; పులహ<పురస్‌+>పురహ్‌-అ; మొదటగా ఉన్నవాడు; క్రతు=క్రియా (స్పందా)త్మక తత్త్వము-ఇత్యాదిగా అర్థములు వ్యుత్పత్తిచే ఏర్పడునని తోచుచున్నది. విచారణ చేసి తత్త్వము నెరుగ యత్నించుట కర్తవ్యము.

గణదేవతల విషయము

సాధ్యులు

వీరు 'గణదేవతలు' - అనగా కొందరు కలిసి ఒక వర్గముగా గ్రహింపబడి సమష్టిగా ఆరాధింపబడువారు; వీరు పండ్రెండు మందియని అగ్ని పురాణమునందును ఇతరత్రను కలదు. మత్స్య పురాణమునందు మాత్రము రెండు చోట్ల రెండు విధములుగా వీరి పేరులున్నవి. వహ్ని (అగ్ని) పురాణమున గణభేదనామాధ్యయమున-

మనో మంతా తథా ప్రాణో భరో7పానశ్చ వీర్యవాన్‌|

నిర్భయో నరకశైవ దంశో నారాయణో వృషః|

ప్రభుశ్ఛేతి సమాఖ్యాతాః సాధ్యా ద్వాదశ దేవాతాః.

అని కలదు (అని వాచస్పత్యము).

భరః (నరః) నిర్భయః (వినిర్భయః) నరక (నయ) అని పాఠాంతరములు;

మత్స్య పురాణమున 202 అధ్యాయమున

'మనో మనుశ్చ ప్రాణశ్చ నరో జాతశ్చ వీర్యవాన్‌|

చిత్తహార్యో7యనశైవ హంసో నారాయణ స్తథా|

విభుశ్చాపి ప్రభుశ్చైవ సాధ్యా ద్వాదశ కీర్తితాః

అని యున్నది.

ప్రజాపతికి సృష్టి సాధన భూతులగు దేవతాతత్త్వములు 'సాధ్యులు' అని సంప్రదాయజ్ఞల వచనము.

మత్స్య పురాణము 170వ అధ్యాయమున వీరి పేరులు 15-16 అగునట్లు వేరు విధముగా నున్నది. హేతువు విచార్యము.

రుద్రులు

రుద్రులు వాయువులకు కూడ తండ్రులని ఋగ్వేదమున స్తుతించబడియున్నారు. రుద్ర శబ్దమునకు నిర్వచనములు సంప్రదాయమునందు అనేక విధములుగా నున్నవి. వీరు పదునొకండు మంది. వీరు విశ్వరక్షకులు; గణదేవతలు; మహాశక్తి సంపన్నులు; నిగ్రహానుగ్రహ సమర్థలు; యజురారణ్యకమున ప్రథమ ప్రశ్నమునందలి సప్తదశానువాకము నందలి మంత్రముల యర్థమును విచారణ చేయగా అట వాయుదశా విశేషములను పదునొకంటిని ఏకాదశ రుద్రులనుగా భావన చేసి ఉపవర్ణించినట్లు కనబడుచున్నది. అపస్తంబ ధర్మసూత్రాదులందలి రుద్రదేవతాక మంత్రముల వినియోగ విధమును చూడగా స్థాన పవిత్రతను కాపాడు సకల జగద్వ్యాపి సకల వస్త్వాత్మకతత్త్వమునుగా రుద్రుని మన పూర్వు లుపాసించినట్లు కనబడును. అతడు సక లౌషధీ సంచయమును తన వశమున నిలుపుకొని లోకరక్ష సేయుచుండును. యజురారణ్యకానుసారము ఏకాదశ రుద్రుల నామములను ఇట్లున్నవి. 1. ప్రభ్రాజమానులు 2. వ్యవదాతులు 3. వాసుకి వైద్యుతులు 4. రజతులు 5. పరుషులు 6. శ్యాములు 7. కపిలులు 8. అతి లోహితులు 9. ఊర్ధ్వులు 10. అవపతంతులు 11. వైద్యుతులు. ఇవి యన్నియు వారి లక్షణములను తెలుపునవిగా కనబడుచున్నవి. ఏలయన 1.విశేషముగా ప్రకాశించువారు 2. మిక్కిలి తెల్లనివారు మొదలగునవి ఈ నామములకు అర్ధములు.

ఇక పురాణ వాజ్మయమున వీరి పేరులు వేరువేరుగా కనబడుచున్నవి. శ్రీమత్స్య మహాపురాణమున నూట ఏబది రెండవ యధ్యాయమున 19వ శ్లోకము:

కపాలీ పింగళో భీమో విరూపాక్షో విలోహితః |

అజేశః శాసన శ్శాస్తా శంభు శ్చండః కుశ స్తథా.

అందే 170 వ అధ్యయమునందు.

నిరృతిశ్చైవ శంభుర్వై తృతీయ శ్చాపరాజితః|

మృగవ్యాధః కపర్ధీ చ దహనో7థ ఖరశ్చ వై.

అహిర్బుధ్న్యశ్చ భగవా న్కపాలీ చాపి పింగళః|

సేనానీశ్చ మహాతేజా రుద్రా స్త్వేకాదశ స్మృతాః.

మత్స్య పురాణమున ఐదవ అధ్యాయములో

అజైకపా దహిర్భుధ్న్యో విరూపాక్షో7థ రైవతః|

హర్యశ్వో (హరశ్చ) బహూరూపశ్చ ప్రబకశ్చ సురేశ్వరః.

సావిత్రశ్చ జయంతశ్చ పినాకీ చాపరాజితః|

ఏతే రుద్రాః సమాఖ్యాతా ఏకాదశ గణశ్వరాః.

మరియొక చోట ఈ రుద్రుల పేరులు ఇట్లున్నవి:

''అజైకపా దహిర్భుధ్య్నో విరూపాక్షః సురేశ్వరః |

జయంతో బహురూపశ్చత్య్రంబకో7ప్యపరాజితః |

వైవస్వతశ్చ సావిత్రో హరో రుద్రా ఇతి స్మృతాః.''

ఇతి జటాధరః. ఇతి శబ్దకల్పద్రుమే వాచస్పత్యేచ.

ఈ శబ్దకల్పద్రుమ వాచస్పత్యములందే. ఈ రుద్రనామములు శ్రీ మన్మహా భారతనందు ఇట్లున్నవని వ్రాయబడియున్నది. 1.అజః 2.ఏకపాత్‌ 3. అహిర్భుధ్న్యః 4. పినాకీ 5.అపరాజితాః 6. త్య్రంబకః 7.మహేశ్వరః 8. వృషాకపిః 9.శంభుః 10. హరః 11.ఈశ్వరః అని మహాభారతమున దానధర్మ పర్వమునందు కలదు అని.

గరుడ పురాణమునందు:

అజైకపా దహిర్భధ్న్య స్త్వష్టా రుద్రశ్చ వీర్యవాన్‌|

త్వష్టుశ్చా ప్యాత్మజఃపుత్త్రో విశ్వరూపో మహాతపాః

హరశ్చ బహురూపశ్చా త్య్రంబక శ్చాపరాజితః|

వృషాకపిశ్చ శంభుశ్చ కపర్దీ రైవత స్తథా|

ఏకాదశైతే కథితా రుద్రా స్త్రీభువనేశ్వరాః. (5 అ.)

ఇందు 'త్వష్టా' అనుదానికి మారుగా 'కృత్తివాసాః' అని అగ్ని పురాణమున కనబడుచున్నది.

ఇట్లు ఈ పౌరాణిక రుద్రుల నామములు పదునొకండును ఈషదీషద్భేదముతో కనబడుచున్నవి. కాని ఇందు ఏపురాణమునందలి ఏఏ నామములు ప్రామాణికమలు? ఏవి అప్రామాణికమలు? అని కాదు విచారణ చేయవలసినది;

ఈ రుద్రులే కాని ఆదిత్యులేకాని సాధ్యమరుత్‌ ప్రభృతి దేవతలేకాని- ఈ దేవతల తాత్త్విక రూపము ఈ ప్రపంచ ప్రవృత్తిలో ఏమి అయియుండును? సృష్టియందలి ఏ మూర్తామూర్త తత్త్వములను మన పూర్వులు ఈ పేరులతో చెప్పిరి? అని విచారణ చేయవలెను. ఆ వాస్తవికతా దృక్కుతో ఆయా విషయములను ఎరిగి ఆస్తికతా బుద్దితో వానిని విశ్వసించి ఆయా దేవతల నారాధించవలయుచు. అంతేకాని దేనిని కాని అవిచారితముగ విశ్వసించుట కాని మొదలే వానిని నమ్మని దృక్కుతో చూచుట కాని ఈ రెండును అనుచితములే.

విశ్వేదేవులు

'విశంతి కర్మసు- ఇతి విశ్వే' 'ఆయా కర్మానుష్ఠానములందు ఆరాధ్యులుగా ప్రవేశమును పొందియున్నవారు' అని అమరకోశ సుధా వ్యాఖ్యయందు 'విశ్వ' నామ నిర్వచనము; వీరు పదిమందియని పురాణములందున్నది. కాని ఆయా కర్మానుష్ఠానములందు ఈ పదిమంది నుండి ఇద్దరనిద్దరను మాత్రమే గ్రహించి ఆరాధించుచుందురు. వీరు 'విశ్వా' అనునామెకు పుత్త్రులని పురాణములలో చెప్పబడినది.

వీరి నామములు:

వసుః సత్యః క్రతు ర్దక్షః కాలః కామో ధృతిః కురుః|

పురూరవా మాద్రవాశ్చ విశ్వేదేవా దశ స్మృతాః (ప్రకీర్తితాః).

సప్త మరుత్తులు - (మత్య్స - సృష్ట్యధ్యాయమున)

''ఆవహాః ప్రవహశ్చైవ సంవహ శ్చోద్వహ స్తథా|

వివహాఖ్యః పరివహః పరావహ ఇతి స్మృతాః

వీరి ఉనికి బ్రహ్మాండమునందు ఏఏ పొరలలో ఎచ్చటెచ్చట కలదోకూడ మన ఆర్ష వాజ్మయమున చెప్పబడినవి.

ద్వాదశాధిత్యులు.

'ఆదిత్యులు' అను పదము రూఢముగా పండ్రెండు మాసములకు అధిపతులదు సూర్యదేవతాభేదములను చెప్పును. అనగా సూర్యడొక్కడేయయినను ఆయా మాసములందు రవి పొందు దశా విశేషములు ఇవి యని స్పష్టము. వారి పేరులు:

ధాతా మిత్రో7ర్యమా రుద్రో వరుణః సూర్య ఏవచ|

భగో వివస్వాన్‌ పూషా చ సవితా దశమః స్మృతః|

ఏకాదశ స్తథా త్వష్టావిష్ణు ర్ద్వాదశ ఉచ్చతే.

మత్స్య పురాణమున భువనకోశ ప్రకరణమున జ్యోతిర్వ్యవస్థయందు చెప్పినదానిని బట్టి వీరి నామములును వీరి క్రమమును ఇది:

1. ధాతా 2. అర్యమన్‌ 3. మిత్రః 4. వరుణః 5. ఇంద్రః 6. వివస్వాన్‌ 7. పర్జన్యః 8. పూషన్‌ 9. హంసః 10. భగః 11. త్వష్టా 12. విష్ణుః.

ఆరణ్యక శ్రుతియందు (-ప్రశ్న-2) ఒకచోట

''మిత్రశ్చ వరుణశ్చ ధాతా చార్యమాచ (హంస) అంశశ్చ ఇంద్రశ్చ వివస్వాంశ్చ'' అని ఎనిమిది నామములే కనబడుచున్నవి.

ఇందు రుద్ర వసు విశ్వేదేవాదిత్యాదుల పేర్లును దక్షాదులగు ప్రజాపతుల పేర్లును ఒకచోట వచ్చనవే మరి యొక చోటను కన-వినబడుచున్నవి. వీరి నిరుక్తార్థమును వీని తాత్త్వికార్థమును ఎరిగినచో ఇట్టి సంమిశ్రణమునకు హేతువు తెలియగలదు. విచారించనిచో అంతయు గందరగోళ##మే.

పురాణ కథలలో కొన్ని చమత్కారములు:

ఈ ద్వాదశాదిత్యలలో మిత్రుడు అనగా ఉదీయ మాన సూర్యుడు; 'వరుణుడు' అస్తంగచ్ఛత్యూర్యుడుః వీరు ఇరువురును లేదా సూర్యుని ఈ రెండు దశలును ఏక కాలమున ఉండునవికావు: దీనిని దృష్టియందుంచుకొని అగస్త్యోత్పత్తి కథలో (అ.61) ఊర్వశి మిత్రావరుణులను ఇరువురను ఒకే మారు సంతోష పెట్టజాలక పోయెనని చెప్పబడినది. ఈ కథయందు 'ఊర్వశియు' సృష్టియందలి తేజో విశేషాత్మిక యగు ఒకానొక శక్తియేయని వేద పురాణ కథలయందలి నన్ని వేశములబట్టి తెలియును.

పితృగణముల విషయము.

హరి వంశమునందు ఈ శ్లోకము కలదు:

''అమూర్తానాంచ మూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్‌|

నమస్యామి సదా తేషాం ధ్యాయినాం యోగచక్షుషా.''

''అమూర్తులును మూర్తులును (రూపములేని వారను - రూపము కలవారును) దీపించు తేజస్సు కలవారును యోగ శక్తి సంపన్న మగు నేత్రముతో ధ్యానసిద్ద దృష్టితో (పరోక్ష విషయములను గూడ ప్రత్యక్షమున ఉపస్థితములయి యున్న వానినిగా) చూచువారును ఇట్టి యోగచక్షువుకల వారిచే ధ్యానింపబడువారును అగు పితరులను సదా సమస్కరింతును.''

ఈ పితరులను గణదేవతెలే వీరు ఒక్కొక్క గణమున ఏడేసి మంది చొప్పున ఏడు గణములుగా నున్నారు. ఇందును అమూర్త గణములు మూడుః 1.వైరాజులు 2. అగ్నిష్వాత్తులు 3. బర్షిషదులు; మూర్తగణములు నాలుగు: 1.సోమపులు 2. హవిష్మంతులు 3. ఆజ్యపులు 4. సుకాలినులు; ఇందును వైరాజులను పితరుల కన్య పార్వతీమాతయగు 'మేనా'.

కౌశికవంశీయ విప్రకుమారులు-పిత్రనుగ్రహందుట.

కౌశిక వంశీయులగు విప్రకుమారులు ఏడుమంది పితరుల యనుగ్రహమందిన వృత్తాంతము శ్రీ మత్స్యమహా పురాణమున శ్రాద్ద కల్పాధ్యాయములందు (అ20-21) కలదు. వీరి విషయము హరివంశమున - హరివంశపర్వమున ఇరువది మూడవ అధ్యాయమున ఇట్లున్నది.

శో.17 జ్ఞాన ధ్యాన తపఃత పూజా వేద వేదాంగ పారగాః|

స్మృతిమంతో7త్ర చత్వార స్త్రయస్తు పరిమోహితాః.

ఇరువది నాలుగవ యధ్యాయమున ఇట్లు చెప్పబడినది:

శ్లో.20 సప్త వ్యాధా దశార్ణేషు మృగాః కలాంజనే గిరౌ|

చక్రవాకాః శరీద్వీ పే హంసా స్సరసి మానసే.

శ్లో. 21 యే స్మ జాతాః కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః |

ప్రస్థితా దీర్ఘ మధ్వానం యూయం తేభ్యో7వసీదత.

(అ.24-శ్లో.20-21) ''మొదట ఎవరు కురుక్షేత్రమునందు వేదపారంగతులు బ్రాహ్మణులగా జన్మించిరో- వారే తరువాత క్రమముగా దశార్ణ దేశములందు ఏడుమంది వ్యాధులుగా - కాలంజన (కాలంజర) పర్వతమునందు ఏడు మృగములు (లేళ్లు)గా శరద్వీపమునందు చక్రవాక పక్షులుగా మానస సరస్సనందు హంసలుగా (కడపటి జన్మమున పాంచాలదేశ రాజధానీ నగరమునందు బ్రాహ్మణ కుమారులుగా మంత్రి కుమారులుగా) జన్నించిరో (వారిలో కొందరు పూర్వజన్మ స్మృతి జన్మసిద్దముగానే కలిగియుండి) దీర్ఘ మార్గమున (మహాప్రస్థాన విధానమున) బయలుదేరిపోయి యున్నారు. (మిగిలిన) మీరును వారిని కలియుటకై శ్రమపడడు.''

(అ.23-17 శ్లో.) ఈ కౌశిక పుత్త్రుల ఏడు మందిలో నలుగురు పూర్వజన్మస్మృతి కలవారు; ముగ్గురు పరి మోహితులు; ఏయినను వీరు అందరు జ్ఞాన ధ్యాన తపః పూజలయందును వేదావేదాంగములందును పారంగతులే (తుదవరకుచేరిన వారే) కాని సామాన్యులు కారు.''

గణదేవతా విశేషములు-వారి సంఖ్య:

''ఆదిత్య విశ్వ వసవ స్తుషితా77భాస్వరా7నిలాః |

మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాః''

(అనియమరకోశ స్వర్గవర్గము)

వీరి సంఖ్య అమరసుధా వ్యాఖ్యయందు ఇట్లున్నది :

''ఆదిత్యా ద్వాదశ ప్రోక్తా విశ్వేదేవా దశ స్మృతాః |

వసవ శ్ఛాష్టసంఖ్యాతాః షట్త్రింశ త్తుషితా మతాః.

ఆభాస్వరా శ్చతుః షష్టి ర్వాతాః పంచాశదూనకాః |

మహారాజికనామానో ద్వే శ##తే వింశతి స్తథా |

సాధ్యా ద్వాదశ విఖ్యాతా రుద్రా ఏకాదశ స్మృతాః.''

తా. ఆదిత్యులు-12; విశ్వేదేవులు-10; వసువులు-8; తుషితులు-36; ఆభాస్వరులు-64; మరుతులు-49; మహా రాజికులు-220; సాధ్యులు-12; రుద్రులు-11; మొత్తము 422 మంది.

సంఖ్యలతో సంబంధించిన శబ్దములు

ముప్పది ముగ్గురు దేవతులు

ఆదిత్యులు12+రుద్రులు 11+ వస్తువుల 8+ఇంద్రప్రజాపతులు లేదా పదిమంది విశ్వేదేవతలలో ఇద్దరిద్దరు లేదా అశ్వి దేవతలు ఇద్దరు కలిసి ముప్పదిమూడు.

ఈ చెప్పిన క్రమమున ఊహించుటకు శతపథ బ్రాహ్మణము నందలి (14 కాం. 8అ. 1 బ్రా. 36) కండికా వచనము సాధకము; కాని ఇందే (13 కాం. 6 అ. 3 బ్రా. 4 కండికా) ''అష్టౌ వసవః ఏకాదశరుద్రాః ద్వాదశాదిత్యాః-తే ఏకత్రిగ్‌ంశత్‌- ఇంద్రశ్చైవ-ప్రజాపతిశ్చైవ త్రయస్త్రిగ్‌ం శత్‌''. అని యున్నది. దీనీనిబట్టి చివరి ఇద్దరును ఇంద్ర ప్రజావతులు-అని గ్రహించవలెను. ఇది పరమ ప్రమాణవచనము.

ఊర్ధ్వలోక సప్తకమ్‌

అధ్యాయము-61. (మత్స్య)

భూర్లోకో7థ భువర్లోకః స్వర్లోకో7థ మహ ర్జనః |

తప స్సత్యం చ సపై#్తతే దేవలోకాః ప్రకీర్తితాః.

అధోలోక సప్తకమ్‌

అతలం వితలం చైవ సుతలం చ తలాతలమ్‌ |

రసా మహాతలే చైవ పాతాల మితి సప్తచ |

అధోలోకాస్తు సపై#్తతే పురాణషు ప్రకీర్తితాః.

ముఖశబ్దార్థము

మత్స్య-159 అ. కుమారస్వామి చరితమున ఈ 'ముఖ'పదము కలదు.

1. ముఖమ్‌ 2. హృదయమ్‌ 3. రహస్యమ్‌ 4. ఉపనిషత్‌. ఇందు

1. ముఖమ్‌ అనునది ఆయా దేవతల మహిమములను తెలుపుచు వారికి సంబంధించిన వృత్తాంతములను దెలుపు ఉపాఖ్యాన విశేషముల రూపముననుండు వాఙ్మయము; ఉదా: స్కందముఖమ్‌-మత్స్య-159 అధ్యాయము; 2. హృదయమ్‌; ఆయాదేవతల స్వరూప లక్షణాదికమును తెలుపు వాఙ్మయము; 3. రహస్యము కూడ ఇంచుమించుగ హృదయము వంటిదే; 4. ఉపనిషత్‌ - తత్తద్దేవతా విషయక తత్త్వ వివేచనా పరమగు వాఙ్మయ విశేషము.

మత్స్య. వ్రతాధ్యాయము-పంచరత్నములు

ఆయా వ్రతాదులందు వినియోగించవలసిన పంచరత్నముల విషయములో-

''పంచ మహాభూతాత్మికా పంచరత్నాత్మికా వా వైజయంతీ మాలా-ఉక్తం చ విష్ణుపురాణ-

పంచరూపా తు యా మాలా వైజయంతీ గదాభృతః (తా)

సా భూత హేతుసంఘాతా భూతమాలా భ##వే ద్ద్విజ! ఇతి.

అత్ర పంచరూ పేతి పదం ముక్తా మాణిక్య మరకతేంద్రనీల వజ్ర సమాన వర్ణేతి వ్యాచక్షతే -విష్ణువహస్యే7పి-

పృథివ్యా నీలసంజ్ఞాన మద్భ్యో ముక్తాఫలాని చ |

తేజసః కౌస్తుభో జాతో వాయో ర్వైదూర్య సంజ్ఞకమ్‌ |

పుష్కరా త్పుష్పరాగస్తు వైజయంత్యా హరే రిమే. ఇతి''

అని సంప్రదాయజ్ఞల వచనము.

వైజయంతి యన మహావిష్ణు వక్షః స్థితమగు మాల పంచ మహాభూతాత్మకము అథవా పంచరత్నాత్మకము; గదాధారి యగు మహావిష్ణువు ధరించు 'వైజయంతిమాల' పంచ(రత్న)రూప; అది మహాభూత సంఘాత(సముదాయ)రూప; కావున అది భూతమాల యనదగి యున్నది; అని విష్ణుపురాణవచనము; ఇందు 'పంచరూపా' అనగా ముత్తెములు మాణిక్యములు మరకతములు ఇంద్రనీలములు వజ్రములు-ఈ రత్నములు-వీని వన్నెలు కలది-యని పెద్దలు వివరించుచున్నారు. విష్ణు రహస్యమను గ్రంథమునందును ''ఇంద్ర నీలము పృథివినుండి ముత్తెములు జలమునుండి కౌస్తుభము తేజస్సునుండి వైడూర్యము వాయువునుండి పు(ష్ప)ష్యరాగము ఆకాశమునుండి జనించినవి. ఇవియే శ్రీహరి వైజయంతీ మాలయందలి రత్నములు.'' అని యున్నది. కనుక పంచరత్నములు అనగా ఈ ఐదును అని గ్రహించవలయును.

సౌభాగ్యాష్టకమ్‌

ఇక్షవ స్తవరాజశ్చ నిష్పావో జాతిధాన్యకమ్‌ |

వికారవచ్చ గోక్షీరం కుసుంభకుసుమం తథా |

లవణం చాష్టమం చాత్ర సౌభాగ్యాష్టక ముచ్యతే.

1. చెరకు 2. యవలు మొదలగువానినుండి తీసిన చక్కెర (వెదురునుండి తీసిన చక్కెర అని కొందరు) (Glucose) 3. బొబ్బరలు 4. జాజికాయ 5. ధనియాలు 6. విరిగిన ఆవు పాలు; 7. కుంకుమ పూవు 8. ఉప్పు

చతుర్దశ మన్వంతరాణి:

ఇహ ఖలు బ్రహ్మకల్పే చతుర్దశ మనవః క్రమశః క్రమంతే; తద్యథా-

స్వాయంభువో మనుః పూర్వం తతః స్వారోచిషో మనుః |

ఔత్తమ స్తామసశ్చైవ రైవత శ్చాక్షుష స్తథా.

షడేతే మనవో7తీతా అథ వైవస్వతో మనుః |

సావర్ణాః పంచ రౌచ్యశ్చ భౌచ్య(త్య) శ్చాగామిన స్త్వమీ.

తత్ర సవర్ణాయాః సంబంధినః సుతాః పంచాపి సావర్ణాః-సావర్ణయో మనవః.

ఇంతవరకునువివరించినవేకాక-సప్తధాన్యములు-అష్టధాన్యములు-అష్టాదశధాన్యములు- పంచ బిల్వములు మొదలగునవి ఎన్నియో పదములు-వివరణమును కోరునవి-యున్నవి. అవి జిజ్ఞాసువులు సంప్రదాయజ్ఞులవలన తెలిసి కొన ప్రార్థన.

Sri Matsya Mahapuranam-1    Chapters